పవన్ కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించిన 'పంజా' చిత్రం 2011 డిసెంబర్‌లో విడుదలైంది. ఆర్కా మీడియా వర్క్స్ (బాహుబలి ప్రొడక్షన్ హౌస్), సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో సారా జేన్ డయాస్, అంజలి లావణ్య హీరోయిన్లుగా నటించారు. అడివి శేష్ నెగటివ్ రోల్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
నిజానికి ఈ సినిమాకు విష్ణువర్ధన్ మొదట అనుకున్న టైటిల్ 'పంజా' కాదు.. 'ది షాడో'. 2011 మే నెలలో కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు వర్కింగ్ టైటిల్‌గా 'ది షాడో'నే పరిగణించారు. అప్పుడే ఇది తాత్కాలిక టైటిల్ అనీ, తర్వాత టైటిల్ మారే అవకాశాలున్నాయనీ టీమ్ చెబుతూ వచ్చింది. దసరా టైమ్‌లో అసలు టైటిల్‌ను ప్రకటిస్తామన్నారు. 'ది షాడో' కాకుండా కాళీ, తిలక్, పవర్, పటేల్ అనే టైటిల్స్‌ను కూడా దర్శక నిర్మాతలు పరిశీలించారు.
చివరకు 'పంజా' అనే టైటిల్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయదశమికి పంజా టైటిల్‌ను ప్రకటిస్తూ, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా రిలీజయ్యాక టెక్నికల్‌గా సినిమా బాగుందనీ, జయ్‌దేవ్ క్యారెక్టర్‌లో పవన్ కల్యాణ్ చాలా బాగా చేశాడనీ, అలాగే ఇతర పాత్రధారులు కూడా బాగా చేశారనీ, యాక్షన్ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చిన విమర్శకులు, కథాకథనాలు ఆసక్తికరంగా లేవని తేల్చేశారు. అందుకు తగ్గట్లే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించలేదు. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ ఆదరణ దక్కింది.